కార్తీకమాసంలో ఏవిధంగా స్నానం చేయాలి?
చేయలేనివారికి ప్రత్యామ్నాయాలు ?
కార్తీకమాసం వచ్చిందంటే శివకేశవుల భక్తులు నదీస్నానాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలో చన్నీళ్ళు మాత్రమే వినియోగించాలి. స్నానం చేసేముందు వంటికి నువ్వులనూనె లేదా నలుగు పెట్టుకోకూడదు. నదికి వెళ్ళలేనివారు ఇంట్లో స్నానం చేసే సమయంలో వారు ఉపయోగించే నీటినే గంగ, యమునా, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు నదుల పవిత్రమైన జలం అని భావించి స్నానం చేసుకోవాలి.
ప్రతిరోజూ స్నానం చేయలేనివారు కార్తీకమాసం మొదటిరోజు, నాగులచవితి రోజున, ఏకాదశులు, క్షీరాబ్దిద్వాదశి, కార్తీకపొర్ణమి, కార్తీక అమావాస్య రోజులలో స్నానం చేసినా శివకేశవుల అనుగ్రహం పొందుతారు.
నదులలో స్నానం చేసేవారు ముందుగా ఇంట్లో శుచిగా స్నానం చేసి నదికి వెళ్ళి రెండు బొటన వ్రేళ్ళతో ముక్కు మూసుకుని, రెండు మధ్య వ్రేళ్ళతో చెవులు మూసుకుని, పూర్తిగా తలతో సహా మూడు సార్లు మునగాలి. నదిలో స్నానం చేసే సమయంలో సబ్బులు, షాంపూలు వంటివి ఉపయోగించకూడదు.
స్నాన రకాలు - వాటికి ప్రత్యమ్నాయాలు ...
మంత్రస్నానం : "అపోహిష్టామయే భువః తాన పూర్జే దధాతన మా హేరణాయ చక్షసే, యేః వశ్శివ తమేరసః, తస్య భాజయతే హనః, యశతీరివ మాతరః, తస్మా అరఃగ మామవః, యస్య క్షమాయ జిన్వధ అపోజన యధా చనః" ఈ మంత్రం చదువుతూ తలపై నుండి స్నానం చేసేదే మంత్ర స్నానం.
మానస స్నానం : తమ ఇష్టదైవాలను లేదా పరమేశ్వరుడిని లేదా శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ తలస్నానం చేసేదే మానస స్నానం.
వారుణ స్నానం : ఎటువంటి మంత్రాలు చదవలేక స్నానం చేయాలి అనే అభిప్రాయంతో తలస్నానం చేసేదే వారుణ స్నానం.
ఈ మూడు స్నానాలే కాకుండా స్నానం చేయలేనివారు, అనారోగ్య పరిస్థితులలో ఉన్నట్లయితే ఈ క్రింద తెలపబడిన వాటిలో ఏదో ఒక స్నానం చేసి అస్నాన దోషం కలగకుండా చూసుకోవచ్చు.
వాయవ్య స్నానం : ఎటువంటి మంత్రాలు రానివారు ఆవుగిట్టల క్రింది ధూళిని తలపై వేసుకున్నట్లయితే స్నానం చేసినట్లే.
ఆగ్నేయ స్నానం : శివాలయంలో లభించే విబూధిని నుదుట ధరించినా లేక తలమీద జల్లుకున్నా స్నానం చేసినట్లే.
కపిల స్నానం : కాలకృత్యాలతో బాధపడేవారు, నాభి పైభాగంలో గాయమై నీరు అంటరాని పరిస్థితి ఉన్నట్లయితే నాభి క్రింది భాగాన్ని నీళ్ళతో శుభ్రపరచుకుని పైభాగాన్ని తడిగుడ్డతో తుడిచినట్లయితే స్నానం చేసినట్లే.
ఆతప స్నానం : ఆరోగ్యం బాగాలేనివారు, సూర్యోదయానికి పూర్వమే లేవలేనివారు ఉదయం ఒక్క క్షణం ఎండలో నిలబడినట్లేయితే స్నానం చేసినట్లే.
Note: HTML is not translated!