కార్తీక పురాణము - ఇరవై ఆరవరోజు పారాయణ
ఇరవై ఒకటవ అధ్యాయం
విష్ణు గణాలు చెప్పినది అంతా విని - విస్మృతచేష్టుడూ, విస్మయ రూపుడూ అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండప్రమాణాలు ఆచరించి, 'ఓ విష్ణు స్వరూపురాలా! ఈ జనానికి అంతా అనేకానేక క్రతు వ్రత దానాలచేత నా కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వలన విష్ణువుకి అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని శలవీయండి' అని వేడుకున్న తరువాత, విష్ణుగణాలు అతన్ని ఇలా సమాధానపరచసాగాయి.
'పాపరహితుడవైన బ్రాహ్మణుడా! నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాస పూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను. పూర్వం కాంచీపురాన్ని 'చోళుడు' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరుమీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్తింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికి అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు ధూపస్తంభాలతో, తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలూ కూడా కుబేర ఉద్యానవనములైన 'చైత్రరథా'ల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొకనాడు 'అనంతశయన' అనే పేర యోగ నిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి, మణిమౌక్తిక సువర్ణ పుష్పాలతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండప్రమాణాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే, 'విష్ణుదాసు' అనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణు అర్చనకోసం ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి, తులసిదళాలతోనూ, గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. అ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా, అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, 'ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పువ్వులతోనూ చేసిన పూజవలన ప్రకాశమానుడు అయిన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేను ఎంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావు అంటే, అసలు నీకు విష్ణుభక్తి టే ఏమిటో తెలుసా?' అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి 'రాజు' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి 'ఓ రాజా! నీకు దైవభక్తి లేదు. సరికదా! రాజ్య ఐశ్వర్య మత్తులో ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి వుంటే చెప్పు' అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేలనగా నవ్వుతూ 'నీ మాటలవలన నీవే విష్ణుభక్తి శూన్యుడివి అని తెలుస్తూ వుంది. ధనహీనుడవూ, దరిద్రుడివీ అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది. అసలు నీవు ఎప్పుడయినా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేనివాడివైన నీకు భక్తుడు అనే ఆహాకారం మాత్రం అధికంగా వుంది. ఓ సదస్యులారా! సద్రాహ్మణులారా శ్రద్ధగా వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడు పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా యిద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది' అని, ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి, చోళుడు స్వగృహానికి వెళ్ళి 'ముద్గలుడు' అనే మునిని ఆచార్యుడిగా చేసుకుని విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయములచేత చేయబడినదీ, అన్నదానాలూ, అనేకానేక దక్షిణాలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిదీ, సర్వసపృద్ధివంతమైనదీ అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు.
పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై, హరిప్రీతికై ఆచరించాల్సిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ, తులసి వన సంరక్షణలూ, ఏకాదశినాడు ద్వాదశాక్షరీయుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలనూ, నృత్యగీత వాయిద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యమూ సర్వవేళలలోనూ, భోజన సమయాలలోనూ, సంచారమందూ, చివరికి నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ, ప్రత్యేకించి మాఘ కార్తీకమాసాలలో విశేష నియమపాలన ఆచరిస్తూ ఉన్నాడు.
ఆ విధంగా భక్తులైన చోళ, విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలనూ వ్రతనిష్ఠలోనే నిలిపి, విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే వుండిపోయారు.
ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం
ఇరవై రెండవ అధ్యాయం
కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కాని, తిరిగి వంటప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడంతో ఆ రోజుకు భోజనం చేయకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణుపూజకు వేళ దాటిపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు భోజనం చేయకుండానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారంరోజులు గడిచాయి. ప్రతిరోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగాలిస్తూనే వున్నారు. అతను పస్తులు ఉంటూ కూడా హరిసేవ చేస్తూనే వున్నాడు. వారం రోజులపాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసుడికీ, ఆ దొంగను పట్టుకోవాలని అనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందరాళే వంట ముగించుకుని, వంటకాలను పూర్వ స్థానంలోనే వుంచి, తాను ఒక చోట దాగి కూర్చుని, దొంగకోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక ఛండాలుడు ఆ అన్నాన్ని దొంగలించడానికి వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉండి. రక్తమాంసాలు ఏమాత్రం లేకుండా కేవలం ఎముకలమీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడూ, అన్నార్తుడూ అయిన ఆ ఛండాలుడు వంటకాలను దొంగిలించుకుని వెళ్ళిపోసాగాడు. అతని దైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో వున్న బ్రాహ్మణుడు 'ఓ మహాత్మా! కాసేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు' అంటూ నేతిఝారీతో సహా అతని వెంటపడ్డాడు. ఆ బ్రాహ్మణుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడు అనే భయంతో ఆ ఛండాలుడు పరుగుతీయడం ప్రారంభించాడు. ఈ బ్రాహ్మణుడు వెనకాలనే పరుగు పెడుతూ 'అయ్యా! నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్యా స్వామీ' అని అరుస్తూనే వున్నాడు. అసలే అలసటగా వున్న ఛండాలుడు భయంవలన నేలపై పడి మూర్చపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు 'అయ్యో! మూర్ఛపోయావా మహాత్మా!' అంటూ తన పైటచెంగులతో ఆ ఛండాలుడికి విసరసాగాడు. ఆ సేవవల్ల అతి శీఘ్రంగా కోలుకున్న ఛండాలుడు, చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు అతను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాధారీ, పీతాంబరుడూ, చతుర్భుజుడూ, శ్రీవత్సలాంచితుడు, కౌస్తుభా అలంకృతుడూ అయిన శీమన్నారాయణుని వలె గోచరించడంతో, అతగాడు సాత్త్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఆ భక్త, భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులు ఎందఱో వినానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువుమీదా, విష్ణుదాసుడి మీదా కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, దేవగణాలయొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. తరువాత ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతోబాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు.
యజ్ఞవాటికలో వున్న చోళుడు ఆకాశంలో ప్రయాణిస్తున్న బ్రాహ్మణ బ్రహ్మ జనకులు ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుడిని పిలిచి 'ఓ ముద్గలమునీ! నాతొ వివాదపడిన ఆ నిరుపేద విపృడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అత్యంత ఐశ్వర్యవంతుడిని అయిన నేను అసాధ్యాలయిన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం సంగతేం కాను. నేను ఎన్ని యజ్ఞాలను చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణాలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నామీద లేశమైనా కృపకలిగినట్లు లేదు. దీన్ని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణువు అనుగ్రహానికి మరొక మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలు అన్నీ అనవసరంగా భావిస్తున్నాను' అని చెప్పాడు. బాల్యం నుంచీ యజ్ఞ దీక్షలోనే వుండటం వలన నిస్సంతుడయిన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.
శ్లో తస్మాదద్యాపి తద్దేశే సదారాజ్యంశ భాగినః
స్వ శ్రీయామేవ జాయంతే తత్కృతావిధి పరివర్తనః !!
ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనళ్ళుల్లే కర్తలు అవుతూ ఉన్నారు.
తరువాత చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి, 'ఓ శ్రీహరీ! త్రికరణశుద్ధిగా నీ భక్తిని నాయందు సుస్థిరం చేయి తండ్రీ!' అని ప్రార్థించి, సమస్త సదస్యులూ చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు.
శ్లో ముద్గలస్తు తతః క్రోథా చ్చిఖ ముతపాతయిన్ స్యకాం
అట స్త్వద్యాపి తద్గోత్రే ముద్గలా విశిఖా భవన్!!
అది చూసి కుద్దుడైన ముద్గులుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికీ 'విశిఖ'గానే వర్థిల్లుతుంది.
హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులో అగ్నినుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుడిని ఆలింగనం చేసుకుని, అతనికి సారూప్యన్ని అనుగ్రహించి, అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్తా! ఆ రోజున ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసునూ, ఇటు చోళుడినీ కూడా అనుగ్రహించి, సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠంలో ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి, ఓ బ్రాహ్మణుడా! విష్ణువు అనుగ్రహానికీ, విష్ణువు సాక్షాత్కారానికీ రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం, అది భక్తి మార్గమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తుడికి బోధించి, విష్ణు స్వరూపులు మానం వహించారు.
ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు సమాప్తం
ఇరవై ఆరవ(బహుళ ఏకాదశి) రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!