శివరాత్రి నోము
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతను ఎంతటి విద్యాసంపన్నుడో అంతటి దారిద్ర్యం అతన్ని వేధిస్తూ ఉండేది. ఎంత ప్రయత్నించినా చేతికి నయాపైసా లభించేది కాదు. దీనితి తోడు అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. ఈ దుర్భర పరిస్థితులలో మరొకరిని యాతన పెట్టడం ఇష్టం లేక వివాహం కూడా చేసుకోలేదు. కావలసినవారు లేకుండా ఉండటంతో అతను మరింత బాధపడుతూ ఉండేవాడు. క్రమంగా అతనికి జీవితంపై విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవడం శాస్త్రసమ్మతం కాదు కాబట్టి నారు పోసినవాడే నీరు పోయకపోతాడా అని కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అయినా క్రమంగా ఓర్పు నశించి ఇక ప్రాణత్యాగం ఒక్కటే తనకి తప్పనిసరి మార్గం అని నిర్ణయించుకున్నాడు. నీటిలో దూకాలో, అగ్నికి ఆహుతి కావాలో, కత్తికటార్లతో పోడుచుకోవాలో లేకపొతే విషాన్ని తాగి ప్రాణత్యాగం చేయాలో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో బ్రాహ్మణుడికి పరమేశ్వరి సాక్షాత్కరించి 'ఓయీ బ్రాహ్మణా! ప్రాణత్యాగం చేయాలని ఎందుకు ప్రాకులాడతావు. సదాశివుడి కన్నా దయామయుడు లేడు, ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు పొంది తరించు' అని తెలిపి అంతర్థానం అయింది. నిద్ర మేల్కొన్న ఆ బ్రాహ్మణుడు ఒక పండితుని దగ్గరికి వెళ్ళి తన బాధలను, తనకు కలలో పరమేశ్వరి సాక్షాత్కారం గురించి తెలిపి శివుడి కరుణ కోసం తాను ఏమి చెయ్యాలి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా తెలిపాడు 'విప్రమోత్తమా! పార్వతీ పరమేశ్వరులు జననీ జనకులు కదా, జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది ధన్యుడవు. శివుడికి ప్రీతిపాత్రమైన రోజు శివరాత్రి, ప్రతిమాసం ఆఖరి మూడవరోజున శివరాత్రి అవుతుంది. ఆరోజు నువ్వు నదీస్నానం చేసి ఉపవాసం ఉండి, ఆ రోజు రాత్రి అంతా శివనామర్చనతో జాగారం చేసి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మరో శివరాత్రి వరకూ గడిపి ఆరోజు నీకు కలిగినంతలో ఎవరికైనా ఒకరికి తృణమో ఫలమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందినట్లయితే నీ బాధలు తీరి దారిద్ర్యం తొలగిపోతుంది. ఆరోగ్యవంతుడివి కూడా అవుతావు' అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు పండితుడు చెప్పిన విధంగా శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకుని జీవితాంతం సుఖంగా వున్నాడు.
ఉద్యాపన : ప్రతి మాసశివరాత్రి రోజున శివలింగార్చనతో ఉపవాసం, జాగరణ చేయాలి. ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి రోజున చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన విధంగా దానం చెయ్యాలి. మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్థం చేయకుండా శివాక్షరిని జపించాలి, శివుడికి అర్చన చెయ్యాలి, ఆరోజు శక్తి కలిగిన మేరకు నిరుపేదలకు అన్నదానం, ఆర్ధిక సహాయం అందించి వారి ఆశీస్సులు పొందాలి.