Karthika Masam Day 11 Parayanam

కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ 
                    ఇరవై ఒకటవ అధ్యాయము


                    యుద్ధవర్ణన


ఆత్ర ఉవాచ :  అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది.  అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు. తరువాత ఇంకొక అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు - బ్రహ్మమంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుడి కవచాన్ని చీల్చి, గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గ్రుచ్చుకున్న బాణాలను పెరికి తీసి, ఆ కాంభోజ మహారాజు 'ఓ పురంజయా! నేను పరులసొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకే త్రిప్పి పంపుతున్నాను తీసుకో'' అంటూ వాటిని తన వింట సంధించి, పురంజయుడి మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వారిని ఆఖరివరకు లాగి కాంభోజుడిపై వదిలాడు. ఆ యిరవై బాణాలూ ఏకకాలంలో అతగాడి గుండెలలోనుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చపోయాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్చగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ, మొండేలు వేరు కాబడి, ఎడం ఎడంగా పడి గిలగిలా తనుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కదనరంగం అంతా కంఠగింపుగా తయారయింది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక, ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి, పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి, ఆనాటి శతృవుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి - 'సుశీలుడు' అనే పురోహితుడు 'మహారాజా! శతృవైన ఆ వీరసేనుడిని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తిప్రవత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం. రాజా! ఇది కార్తీక పూర్ణిమ, కృత్తికా నక్షత్రయుతుడై-చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా వుండే ఈవేళ, ఈ ఋతువులో లభించే పూలను సేకరించి, హరిముందు మోకరించి పూజించు. విష్ణుసన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర, గోవిందా-నారాయణా- మొదలైన నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆపాటలతో పరవశుడై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీకమాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శతృభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరివల్లా అయ్యే పనికాదు. భూపతీ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడంగాని, నీకు శరీరబలం లేకపోవడంగాని కానేకాదు సుమా! మితిమీరిన అధర్మవర్తనం వలన. నీ ధర్మబలం దానిద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయా! శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నామాటలను విశ్వసించు. 
                    ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం 
                    ఇరవై రెండవ అధ్యాయము


                    రెండవనాటి యుద్ధం - పురంజయుని విజయం


అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు ... అగస్త్యా! ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి, వివిధ ఫలపుష్పాలతో విష్ణువును షోడశోపచారాలతో పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి, మేళతాళాలతో ఆయనను కీర్తించి, పారవశ్యంతో నాట్యం చేశాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలుచేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైనన పురంజయుడు, మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే, శతృవులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం చెవినపడిన కాంభోజ, కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాలవంటి కత్తులతోనూ, పిడుగులవంటి బాణాలతోనూ, అమిత వేగావంతాలూ - ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ, ఐరావతాలతోనూ, అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది. గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడుచేయడం వలన, ఆనాటి యుద్ధంలో శతృరాజులు శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వరికూతం యొక్క పదాతిబలాలూ దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదలి తమతమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడు అయితే శత్రువు మిత్రుడు అవుతాడు. విష్ణువు ప్రతికూలుడు అయితే మిత్రుదేశం శతృవు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలలో ప్రపతమైన కార్తీకవ్రత ధర్మానుష్టానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలూ కూడా చిటికెలమీదనే చిమిడిపోతాయి. అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి, శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతమూ, శ్రీహరిసేవా వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే, వైష్ణవ ఉత్తములుగా పరిగణింపబడతారు. వేదవిదులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరిసేవా, కార్తీక వ్రత ఆచరణలు లేనివాళ్ళు కర్మచంఢాలులేనని గుర్తించు. ఇక వేదావేత్తయై, హరిభక్తుడై, కార్తీక వ్రతనిష్టుడైన వాడియందు సాక్షాత్తూ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతివాళ్ళయినా సరే ఈ సంసార సాగరాన్నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు. అగస్త్యా! స్వతంత్రుడుగానీ, పరతంత్రుడుగానీ హరిపూజా చేసేవాడై ఉంటేనే ముక్తి, భక్తులకూ శ్రీహరీ, విష్ణువుకీ భక్తులూ అన్యోన్యనుతబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి వున్న ఆ విష్ణువుయందు భక్తిప్రవత్తులున్నవారికి మాత్రమే. కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి, వేదసమ్మతమూ, సకలశాస్త్రసారమూ, గోప్యమూ, సర్వవ్రత ఉత్తమమూ అయిన ఈ కార్తీకవ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహత్యాన్ని మనఃస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహాత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడంవలన - పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా!


                    త్రయోవింశ అధ్యాయము


హే ఆత్రి మునీంద్రా! విష్ణు కృపవలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అని, అగస్త్యుడు కోరడంతో, ఆత్రి ఇలా చెప్పసాగాడు.
భగవంతుని కృపవలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రుడిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను వదిలిపెట్టి - సత్యశౌదపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు, మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వల్ల విగతకల్మషుడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాన్ని జయించి - పరమ వైష్ణవుడు అయి ఏ ఏ దేశాలలో, ఏ ఏ క్షేత్రాలలో, తీర్థాలలో విష్ణువునే అన్ని విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా! అనే తపనతో వుండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన తప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి 'పురంజయా! కావేరితీరంలో శ్రీరంగక్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే  పేరున అక్కడ వెలసివున్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి, జననమరణాల నుంచి కడతేరమని ప్రబోదించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీలో ఉన్న భూలోకవైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని, కార్తీక మాసం అంతా కావేరీనదిలో స్నానాదులనీ, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణమూ కూడా 'కృష్ణా! గోవిందా! వాసుదేవా! శ్రీరంగనాథా! అని హరినే స్మరిస్తూ జప, దాన మొదలైన విద్యుక్తధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తిచేసుకుని తిరిగి అయోధ్య చేరుకున్నాడు. తరువాత ధర్మకామం వలన సత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది, కొన్నాళ్ళకు సర్వభోగాలు విడనాడి, భార్యాసమేతంగా వానప్రస్థం స్వీకరించి, కార్తీక వ్రతాచరణ, విష్ణుసేవలోనే లీనమై పుణ్యవశాన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు.


                    ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు అధ్యాయాలు సమాప్తం


                    పదకొండవ రోజు పారాయణ సమాప్తం. 


                                

Products related to this article

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi be..

₹180.00

0 Comments To "Karthika Masam Day 11 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!