వామనజయంతి
పజ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ ఆధ్వరమ్ బకేః !
పడత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్ఠపమ్ !!
ధర్మ సంస్థాపనార్థం అవసర సమయాలలో అవతరిస్తూనే ఉంటాను అని శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు. అందులో భాగంగానే శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారమే వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున ఆదితి, కశ్యపుల కుమారుడిగా వామనమూర్తిగా అవతరించాడు. దీన్నే వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా పిలుస్తారు. వ్యాసుడి చేత రచింపబడిన పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. పూర్వం యుద్ధంలో దైత్యరాజైన బలిచక్రవర్తిని ఇంద్రుడు యుద్ధంలో ఓడించాడు. పరాజయం పాలైన బలి రాక్షస గురువైన శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నాడు.
కొంతకాలం గడిచిన తరువాత గురుకృప వల్ల బలి ఇంద్రుడిని ఓడించి స్వర్గంపై అధికారం సంపాదించాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక ఆకృత్యాలకు పాల్పడసాగారు. ఇంద్రుడు తన తల్లి ఆదితిని శరణువేడుకున్నాడు. ఇంద్రుని దుస్థితి చూసిన ఆదితి పయోవ్రతానుస్థాననాన్ని ఆచరించింది, కేశవుడిని వేడుకుంది. ఆ వ్రతం చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై ఆదితితో "దేవీ! చింతించకు నీకు నేను పుత్రుడిగా జన్మించి, ఇంద్రుడికి తమ్ముడిగా ఉండి వాడికి శుభం చేకూరుస్తాను'’ అని చెప్పి అంతర్థానం అయ్యాడు. ఈ విధంగా ఆదితి గర్భంలో శ్రీమహావిష్ణువు వామన రూపంలో జన్మించాడు. భగవంతుడిని పుత్రునిగా పొందిన ఆదితికి అంతులేని ఆనందం కలిగింది. శ్రీమహావిష్ణువు వామనుడైన బ్రహ్మచారి రూపాన్ని మహర్షులు, దేవతలు దర్శించి ఎంతగానో ఆనందించారు. ఆదితి దంపతులు వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు చేశారు.
ఒకసారి బలిచక్రవర్తి భృగుకచ్చం అనే ప్రదేశంలో అశ్వమేథ యాగం చేయించుతున్నాడని వామనుడు విని అక్కడికి వెళ్ళాడు. వామనుడు ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడు, యజ్ఞోపవీతం ధరించి, శరీరంపై జంతుచర్మాన్ని, శిరస్సులో జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపంలో యజ్ఞమండపానికి చేరుకున్నాడు. వామనుడి రూపాన్ని చూసిన బలి హృదయం గద్గదమైంది. బలి చక్రవర్తి వామనరూపుడైన శ్రీమహావిష్ణువును ఉచితాసనంపై ఆసీనుడిని చేసి పూజించాడు. “స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు' అంటూ దీవించాడు వామనమూర్తి. వామనుడి వాక్చాతుర్యానికి ముగ్దుడైన బలి, వామనుడిని ఏదైనా కోరుకోమని అన్నాడు. వామనుడు "మూడు పాదాల భూమి మాత్రం నాకు ఇవ్వు'’ అని కోరుకున్నాడు. భూదానానికి సిద్ధమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు అడ్డుతగిలాడు. కానీ బలి శుక్రుడి మాటలను వినకుండా వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేయడానికి పాత్రను ఎత్తాడు. శుక్రాచార్యుడు తన శిష్యుడి మేలు కోరుకుని జలపాత్రలో ప్రవేశించి నీళ్ళు వచ్చే మార్గాన్ని ఆపాడు. కానీ వామనుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరువచ్చే దారిని ఛేదించాడు. దాంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది.
సంకల్పం పూర్తయిన తరువాత త్రివిక్రముడిగా వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకుని, ఒక పాదంతో భూమినీ, మరొక పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అని బలిని అడగ్గా మూడవ పాదానికి బలి తనని తానే సమర్పించుకున్నాడు. వామనుడు తన పాదంతో బలిని రసాతలానికి అణగదొక్కాడు. బలిచక్రవర్తి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోక ఆధిపత్యాన్ని ప్రసాదించాడు.
ఇటువంటి మహిమాన్వితమైన వామనుడి జయంతి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో, నిష్ఠగా ఆర్చించి, ప్రార్థించేవారు అష్టైశ్వర్యాలు పొందుతారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలను సందర్శించుకుని పూజించి, అర్చనలు చేసినట్లయితే పుణ్యఫలంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని పండితులు తెలుపుతున్నారు.
Note: HTML is not translated!