వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం
సృష్టిలో తొలి శబ్దం ‘ఓం’కారం. సంస్కృత భాషలో ‘ఓం’ అనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి వంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. ‘ఓం’కారానికి ఆకారం అది. ‘ఓం’కారం అంటే ‘ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది. అది ఆయన బొజ్జ. మధ్యనుంచి వుండే తోక, ఆయన తొండం. దాని పైనున్న అర్థచంద్రరేఖ చవితి చంద్రుడు. వినాయకుడు పుట్టింది భాద్రపద శుద్ధచవితి కదా. దాని మధ్యలోనున్న బిందువు ‘హస్త’ నక్షత్రం. చంద్రుడు హస్త నక్షత్రంతో కలిసి ఉండే మాసం ‘భాద్రపదమాసం’. అంటే... వినాయకుడు భాద్రపద శుద్ధ చవితినాడు హస్త నక్షత్రంలో పుట్టాడన్నమాట. ఇది ‘ఓం కారం’ మనకు చెప్పే రహస్యం. ఇక - సకల విద్యలకూ,మంత్రాలకూ తొలి అక్షరం ‘ఓం’. ఏ మంత్రం ఆరంభించినా, ఓం కారంతో ప్రారంభం కావలసిందే. పిల్లలకు ‘అక్షరాభ్యాసం’ చేసేటప్పుడు కూడా..‘ఓం నమః శివాయ సిద్ధం నమః’ అని తొలిసారిగా వ్రాయిస్తారు. అందుకే.. వినాయకుడు సర్వ విద్యలకూ, సకల మంత్రాలకూ అధినాథుడు. తనే ముందుండి ఈ చరాచర జగత్తును నడిపిస్తూంటాడు. విఘ్నాలు రాకుండా కాపాడుతూం టాడు. అందుకే.., ఆయన జన్మదినం ఈ జగత్తుకే పండుగ దినమైంది. వినాయకుడు అల్పతోషి. ఆయనను పూజించడానికి పెద్దగా ఆచారాలు పాటించనక్కరలేదు. మనం అలిసిపోయేలా అభిషేకాలు చేయనక్కరలేదు. ఖర్చుతో కూడిన నైవేద్యాలు సమర్పించనక్కరలేదు. భక్తిగా నాలుగు గరిక పరకలు అర్పించినా, నాలుగు కుడుములు ముందుంచి నైవేద్యంగా పెట్టినా.., ఆనందంగా స్వీకరించే దేవుడు మన గణపయ్య ఒక్కడే. ఈ నవరాత్రులు గణపతి పూజించి, చివరి రోజున నీటిలో నిమర్జనం చేసినా, చిరునవ్వుతో అభయ హస్తంతో, తొండమెత్తి ఆశీర్వదిస్తాడు గణనాయకుడు.
మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి ?
Reasons for Praying Matti ( Clay ) Vinayaka ?
అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కదా. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకుడినే పూజించాలి. అప్పుడే... భక్తి.. ముక్తి. అలాగే మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం. మనకు జీవం, జీవితం, మనుగడని ప్రసాదిస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుడిణే పూజిద్దాం. వినాయకచవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి వుంటుంది. మట్టిలో నుండే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మానవాళికి విధితమే. అది ఒక కారణమైనా.. మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల, అందరూ తమకు తెలియకుండానే చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది, చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది. వినాయకచవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విషపదార్ధంతో సమానం. మనకు అన్నీ ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విషపదార్ధాన్ని పూజించడం ఎంతవరకు సమంజసం? అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే నీళ్ళు పూర్తిగా కలుషితమైపోతాయి. మట్టి వినయాకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే వుండదు. అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకీ మంచిది, పర్యావరణానికీ మంచిది. పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసి పూజించే వారినే ఇష్టపడతాడు.
Note: HTML is not translated!