Mahashivaratri

    మహాశివరాత్రి 

 

మాఘమాసం కృష్ణపక్షం, చతుర్ధశి రాత్రివేళ లింగోద్భవం జరిగినట్లుగా స్కాంద తదితర పురాణగ్రంథాలు తెలియజేస్తున్నాయి. చతుర్ధశి పగటిసమయం అయినా ఆ రోజు అర్థరాత్రి లింగోద్భవ సమయంగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగా పాటించడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతీ నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి రోజు శివుడికి అత్యంత  ప్రీతిపాత్రమైన రోజు. దానినే మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే చతుర్ధశిని మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తారు. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది. సృష్టి, స్థితిలయకారులలో, లయకారుడు అయిన పరమశివుడి పార్వతీదేవిల కళ్యాణం.  నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి, యోగ శివరాత్రి అని అయిదు విధాలు అని పండితులు చెబుతున్నారు. మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం హిందువుల క్యాలెండర్ నెలలో అమావాస్య ముందు మాఘమాసం యొక్క కృష్ణపక్ష చతుర్ధశిన జరుపుకుంటారు. 


మహాశివరాత్రి వృత్తాంతం 


గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణమహర్షి (సూత మహర్షి) అక్కడికి రాగా ఋషులు సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమని అడిగారు. దానికి సూత మహర్షి తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన      వివరించడం ప్రారంభించాడు. ఒకసారి పరాశర కుమారుడు అయిన వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో ధ్యానం చేస్తుండగా అదే సమయంలో సూర్యుడిలా ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్తుంటాడు. అది గమనించిన వ్యాసమహర్షి, బ్రహ్మ కుమారుడు అయిన సనత్కుమారుడికి నమస్కరించి ముక్తిని ప్రసాదించే కథను చెప్పమని అడిగాడు. అప్పుడు సనత్కుమారుడు తనకు నందికేశ్వరుడికి మధ్య మందర పర్వతం మీద జరిగిన సంవాదాన్ని వ్యాసుడికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని  శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని తెలిపాడు. 


ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తం కాగా మహాత్ములైన బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. ఒకనాడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళగా అక్కడ శయ్యపై నిద్రపోతున్న శ్రీమహావిష్ణువుని చూసి 'నీవు ఎవరు నన్ను చూసి గర్వంతో శయ్యపై పడుకున్నావు. లే, నీ ప్రభువును వచ్చాను, నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధింపబడుతుంది' అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు, బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం పై కూర్చుండబెట్టి 'నీ చూపులు ప్రసన్నంగా లేవు ఎందుకు?' అని అన్నాడు. దానికి సమాధానంగా బ్రహ్మ 'నేను కాలంతో సమానమైన వేగంతో వచ్చాను. పితామహుడిని, జగత్తును. నిన్ను కూడా రక్షించేవాడిని' అన్నాడు. అప్పుడు విష్ణువు 'జగత్తు నాలోనే ఉంది. నీవు దొంగలా వచ్చావు. నువ్వే నా నాభిలోని పద్మం నుండి జన్మించావు. కాబట్టి నీవు నా పుత్రుడివి.  నీవు అనవసరంగా నాతొ మాట్లాడుతున్నావు' అన్నాడు. ఆ విధంగా ఇరువురి మధ్య సంవాదం మొదలుపెట్టారు. చివరికి యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యారు.


బ్రహ్మ తన వాహనమైన హంసపై, విష్ణువు తన వాహనమైన గరుత్మంతుడిపై ఉండి యుద్ధం ప్రారంభించారు. ఆ విధంగా వారిద్దరూ యుద్ధం చేస్తుండగా దేవతలు వారివారి వాహనాలపై చూస్తుంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉండగా వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర  సమానమైన బాణాలు సంధించుకోసాగారు. ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వర అస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీద ఒకరు సందించుకున్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలు భీతి కలిగి ఏమీ చేయలేక వారందరూ కైలాసానికి బయలుదేరారు. ప్రమథగణాలకు నాయకుడు అయిన పరమశివుని నివాస స్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసమేతుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవుడికి పరిచారికలు భక్తిశ్రద్ధలతో వింజామరలు వీస్తున్నారు. ఈ విధంగా  ఉన్న పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కార ప్రణామాలు చేశారు. పరమశివుడు దేవతలను దగ్గరకు రమ్మని, దేవతల ద్వారా బ్రహ్మ, విష్ణువుల యుద్ధం గురించి తెలుసుకున్న నీలకంఠుడు వెంటనే తన ప్రమథగణాలతోనూ, పార్వతీ దేవితో కలిసి బయలుదేరుతాడు. యుద్ధరంగానికి చేరుకున్న శివుడు రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించే సమయంలో పరమశివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకున్నాడు.


బ్రహ్మా, విష్ణువులు ఆశ్చర్యంగా ఆ స్తంభం యొక్క ఆది, అంతం కనుక్కోవడానికి వారి వారి వాహనాలపై బయలుదేరారు. విష్ణువు అంతం కనుక్కోవడానికి, బ్రహ్మ ఆది తెలుసుకోవడానికి బయలుదేరుతారు. అలా వారు ఎంత వెళ్ళినా కనుక్కోలేక పోతారు. విష్ణువు వెనకకు రాగా, బ్రహ్మకి  మార్గమధ్యంలో కామధేనువు క్రిందికి దిగుతూ, మొగలిపువ్వు (బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ శివుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారిపడిన) క్రింద పడుతూ కనిపించాయి. ఆ రెండింటినీ బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండి, ఆపత్కాలంలో అసత్యం చెప్పడం ధర్మ సమ్మతమే' అని చెప్పి కామధేనువుతో, మొగలిపువ్వుతో ఒడంబడిక చేసుకుంటాడు.


తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ డస్సిపోయి ఉన్న విష్ణువును చూసి, తాను ఆదిని చూశాననీ, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలిపువ్వు అని చెబుతాడు. విష్ణువు ఆ మాటలను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజచేస్తాడు. కానీ, శివుడు కామధేనువును, మొగలిపువ్వును వివరంగా చెప్పమని అడగ్గా, బ్రహ్మ స్తంభం ఆది చూడడం నిజమే అని మొగలిపువ్వు చెబుతుంది కానీ కామధేనువు మాత్రం నిజమే అని తల ఊపి, కాదు అని తోకను అడ్డంగా ఊపుతుంది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు. అది చూసి విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివుడికి నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.


శివుడు, బ్రహ్మ గర్వాన్ని అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో బ్రహ్మను శిక్షించమని చెబుతాడు. భైరవుడు శివుడి ఆజ్ఞపై వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలోని ఏ ముఖం అయితే అసత్యం చెప్పిందో దాన్ని కత్తితో నరికేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి దగ్గరకు వెళ్ళి, పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చావు. ఈ మొదటి దైవం అయిన బ్రహ్మను ఇప్పుడు క్షమించు అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న శివుడు తనను శరణు కోరిన బ్రహ్మను ఉద్దేశించి ఓ బ్రహ్మా! నీకు గొప్పదైన దుర్లభమైన వరాన్ని ఇస్తున్నాను. అగ్నిష్టోమము, దర్శ మొదలైన యజ్ఞాలలో నీది గురు స్థానము. ఎవరైనా చేసిన యజ్ఞాలలో అన్ని అంగాలు ఉన్నా, అన్నింటినీ సక్రమంగా నిర్వర్తించినా, యజ్ఞ నిర్వహణ చేసిన బ్రాహ్మణులకు దక్షిణాలు ఇచ్చినా నీవు లేని యజ్ఞము వ్యర్థం అవుతుంది' అని వరం ప్రసాదించాడు.


అలాగే మొగలిపువ్వును, కామధేనువులకు శాపం ఇచ్చాడు. అసత్యం పలికిన మొగలిపువ్వు నీకు పూజలు ఉండవు, పూజలలో నిన్ను ఉపయోగించకూడదు అని శపించాడు. దీంతో మనస్తాపం చెందినా మొగలిపువ్వు స్వామీ నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషం ఉంటుందా అని స్తుతించింది. దీంతో ప్రీతి చెందినా శివుడు అసత్యం చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు, అలాగే కేతకీ పుష్పంఛత్ర రూపంలో నాపై ఉంటుంది అని వరం ప్రసాదించాడు. కామధేనువు అసత్యం పలికిన కారణంగా నీకు పూజలు ఉండవు అని శాపం ఇచ్చాడు. అప్పుడు కామధేనువు తోకతో నిజం చెప్పాను కదా అని శివుడిని ప్రాధేయపడింది. భోళాశంకరుడు ప్రసన్నుడై మొహంతో అసతం చెప్పావు కాబట్టి నీ ముఖం పూజనీయం కాదు, కానీ సత్యం పలికిన నీ వృష్ఠ భాగం పునీతమై పూజలు అందుకుంటుంది' అని వరం ప్రసాదించాడు. అప్పటినుండి గోమూత్రము, గోమయము, గోక్షీరాలు పునీతమై పూజా పురస్కారాలలో వాడబడుతున్నాయి.    


మహాశివరాత్రి వ్రత కథ 


ఒకరోజు కైలాస పర్వతంపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివుడితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం, భక్తి ముక్తి ప్రదాయకమైన దాన్ని తెలుపు అని కోరింది. అప్పుడు పరమశివుడు శివరాత్రి వ్రతం అనే దాని విశేషాలను తెలియజేసాడు. దీన్ని మాఘబహుళ చతుర్థశి రోజు ఆచరించాలి అని, తెలిసికాని, తెలియకకాని చేసినా యముడి నుండి తప్పించుకొని ముక్తిని పొందుతారు అని తెలిపి దాని దృష్టాంతంగా ఈ కథను వివరించాడు.


పూర్వం ఒక పర్వతప్రాంతంలో వ్యాధుడు అనే వేటగాడు ఉండేవాడు. వ్యాధుడు ప్రతిరోజూ ఉదయం అడవిలో వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక జంతువును చంపి తీసుకుని వచ్చి దాంతో తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఉదయం అడవికి వెళ్ళి ఎంత తిరిగినా ఒక మృగం కానీ జంతువు కానీ కనిపించలేదు. వట్టి చేతులతో ఇంటికి వెళితే భార్యా పిల్లలకు ఏం పెట్టాలి అని మనసు ఒప్పక చేసేది లేక ఇంటికి బయలుదేరాడు. అతనికి మార్గమధ్యంలో ఒక సరస్సు కనిపించింది. ఏ మృగమైనా  నీళ్ళు తాగడానికి ఇక్కడకు రాకుండా పోతుందా అని తలచి దగ్గరలోని ఒక చెట్టుపైకి ఎగబ్రాకి అడ్డుగా ఉన్న కొమ్మలను, ఆకులను తెంపి క్రింద పడేసి కూర్చున్నాడు. చలికి వణికిపోతూ 'శివ శివా' అనుకుంటూ చెట్టుపై కూర్చుని సరస్సును చూస్తూ కూర్చున్నాడు.


మొదటి ఝాము గడుస్తున్న సమయంలో ఒక పెంటిలేడి నీరు త్రాగడానికి సరస్సుకు వచ్చింది. వేటగాడు ఆనందంతో బాణం విడవబోగా పెంటిలేడి 'వ్యాదుడా! నన్ను చంపకు, నేను గర్భిణిని, నీకు అవధ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడే భోజనం లభించదు కాబట్టి నన్ను వదిలిపెట్టు. ఇంకొక పెంటిజింక కాసేపట్లో ఇక్కడికి వస్తుంది దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకు అప్పగించి వస్తాను' అని మనుషభాషలో పలికింది. వ్యాధుడు సరే అని అన్నాడు.


పెంటిలేడి చెప్పినట్లుగానే రెండవ ఝాముకు పెంటిజింక కనిపించింది. వ్యాధుడు బాణం విడవబోగా ఆ జింక భయపడుతూ 'ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను, తరువాత నన్ను చంపవచ్చు. నేను విరహంతో కృంగికృశించిపోయి ఉన్నాను. నాలో మేథోమాంసం లేదు, నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజింక ఇక్కడకి వస్తుంది. దాన్ని చంపు అలా కాని పక్షంలో నేనే తిరిగి వస్తాను అని మానవ భాషలో చెప్పింది. దీనికీ సరే అన్నాడు వ్యాధుడు.


పెంటిజింక చెప్పినట్లుగానే మూడవ ఝాములో బాగా బలిసిన మగజింక వచ్చింది. వ్యాధుడు దాన్ని చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణం విడవబోతున్న సమయంలో మగజింక వేటగాడిని చూసి, తన ప్రియురాలిని కూడా ఇతనే చంపి ఉంటాడు అని తలచి అడిగితే సందేహం తీరిపోతుంది కదా అని తలచి 'ఓ మహానుభావా! రెండు పెంటిజింకలు ఇక్కడికి వచ్చాయా? అవి ఎటువైపు వెళ్ళాయి. వాటిని నీవు చంపావా?' అని ప్రశ్నించింది. దానికి వేటగాడు 'అవి తిరిగి వస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపాయి' అన్నాడు. మగజింక కూడా ఇలా పలికింది 'సరే అయితే నేను ఉదయం నీ యింటికి వస్తాను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను' అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. 


మళ్ళీ ఇంకా కొంత సమయం తరువాత ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. 'వ్యాదుడా! నేను పిల్లలతో వచ్చాను. వీటిని యింటి దగ్గర దిగబెట్టి త్వరగా వస్తా'ను అని చెప్పి వెళ్ళింది.


ఈ విధంగా నాలుగు ఝాములు గడచిపోయి సూర్యోదయం అయింది. వ్యాధుడు జింకల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంత సేపటికి నాలుగు జింకలు వచ్చాయి. నేను సిద్ధంగా ఉన్నాను నన్ను చంపు అంటే నన్ను చంపు అని నాలుగు జింకలు వ్యాధుని ఎదుట నిలబడ్డాయి. జింకల సత్యనిష్ఠకు వ్యాధుడు ఆశ్చర్యపడి వాటిని చంపడానికి మనసు ఒప్పక తన హింసావృత్తిపై అసహ్యం అనిపించింది. 'ఓ మృగాల్లారా! మీరు మీ నివాసాలకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసం అఖ్ఖరలేదు. మృగాలను బెదిరించడం, బంధించడం, చంపడం పాపము. కుటుంబం కోసం నేను ఇకపై పాపం చేయను. ధర్మాలకు దయ మూలం.  దయ చూపడం కూడా సత్యఫలమే కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఇక సత్యధర్మాని ఆశ్రయించి అస్త్రాలను వదిలిపెడుతున్నా'ను అని చెప్పి మృగాలకు నమస్కరించాడు. ఇంతలో ఆకాశంలో దేవదుందుభులు మ్రోగి, పుష్పవర్షం కురిసింది. దేవదూతలు మనోహరమైన విమానం తీసుకువచ్చి ఇలా అన్నారు.   'ఓ మహానుభావా! శివరాత్రి ప్రభావంతో నీ పాతకం క్షీణించింది. ఉపవాసం, జాగరణ చేశావు. నీకు తెలియకుండా ఎక్కిన వృక్షం బిల్వ వృక్షం. దాని క్రింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగునపడి ఉంది. నీకు తెలియకుండానే బిల్వపత్రాలు త్రుంచి వేశావు. అది నీవు శివలింగానికి చేసిన పూజ. కాబట్టి సశరీరంగా స్వర్గానికి వెళ్ళు. నీవు సకుటుంబంగా నక్షత్రపదం పొందు అని పలికారు.


ఈ కథ చెప్పిన తరువాత పరమశివుడు పార్వతితో ఇలా అన్నాడు. దేవీ ! ఆ మృగ కుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రం. మూడు నక్షత్రాలలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి, ఈ మూడింటినీ మృగశీర్శ  అని అంటారు. వాటి వెనుక ఉన్న నక్షత్రంలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రం అని తెలిపాడు. 


శివరాత్రి పూజా విధానం

పరమశివుడు లింగరూపుడిగా ఆవిర్భవించిన పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజునే పార్వతీపరమేశ్వరుల పరిణయం కూడా. ఈ రోజున పరమశివుడు ఆనందతాండవం చేశాడట. శివరాత్రి పర్వదినాన సూర్యోదయానికి పూర్వమే నిద్రలేని కాలకృత్యాలు, అభ్యంగన స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకున్న తరువాత శివుడికి పూజలు అభిషేకాలు చేయాలి. శివరాత్రి రోజున పగలు అంతా ఉపవాసాజ్ పాటించి రాత్రి మొత్తం శివనామ స్తోత్రాలు పఠిస్తూ జాగరణ చేయాలి. జాగరణ సమయంలో మొదటి ఝామున శివలింగాన్ని పాలతో అభిషేకించి, పువ్వులతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించాలి. రెండవ ఝామున శివలింగాన్ని పెరుగుతో అభిషేకించాలి, తులసిదళాలతో పూజించిన తరువాత నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి. మూడవ ఝామున శివలింగాన్ని నేతితో అభిషేకించాలి, మారేడుదళాలతో పూజించిన తరువాత నైవేద్యంగా నువ్వులతో చేసిన పదార్థాలను నివేదించాలి. మరి నాలుగవ ఝామున తేనెతో అభిషేకించి, పువ్వులతో పూజించి నైవేద్యంగా అన్నాన్ని నివేదించాలి. మరుసటి రోజున తిరిగి స్నానసంధ్యలు పూర్తిచేసుకుని శివపూజలు చేసి నైవేద్యం సమర్పించిన తరువాత భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి.    

 

శివుడిని ఏ పూలతో పూజించాలి, ఏ దానాలు చేయాలి?


భక్తసులభుడు, భోలాశంకరుడు, ముక్కంటిని మనస్ఫూర్తిగా ఏ పువ్వుతో అయినా పూజించవచ్చు. భక్తులు భక్తితో సమర్పించిన ఎనభై కలపాల వరకు దుర్గతి కలగదని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇంటి పెరటిలో పూసిన పువ్వులతో పూజిస్తే శాశ్వతంగా శివుడి సన్నిధిలో నివాసం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే అడవిలో పూచిన పువ్వులు అంటే పరమశివుడికి ఎంతో ప్రీతిదాయకం. శివుడికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పకుండా ఉండితీరాలి. మహారాత్రి పర్వదినాన శివుణ్ణి బిల్వదళాలతో పూజిస్తే శివ నివాసం అయిన కైలాస ప్రాప్తి కలుగుతుంది. దర్భపువ్వులతో అర్చిస్తే స్వర్నలాభం కలుగుతుంది. తెల్లని మందార పువ్వులతో పూజిస్తే అశ్వమేథ యజ్ఞం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. తామర పువ్వులతో శివుడిని అర్చిస్తే పరమపదగతి కలుగుతుంది, గన్నేరు పువ్వులను పరమశివుడికి ఏ సమయంలో అయినా సమర్పించవచ్చు అని పురోహితులు చెబుతున్నారు. శివుడిని రాత్రిపూట మల్లెలతో, మూడవ ఝామున జాజిపువ్వులతో అర్చిస్తే శుభఫలితాలు కలుతుతాయి. మహాశివరాత్రి పర్వదినాన పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి ఒకక్ బిల్వమైనా శివుడికి అర్పించి జన్మ తరింప చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది.  మహాశివరాత్రి రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వర్తించి, 11 మంది వృద్ధ దంపతులకు అన్నదానం, వస్త్ర దానం, దక్షిణ తాంబూలాలు దానం చేసిన వారి ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు అని వేదపండితులు చెబుతున్నారు. గోదానం, క్షీరదానం చేసినవారికి పదివేల సంవత్సరాలు శివుడి సాన్నిధ్యంలో గడిపే అదృష్టం కలుగుతుంది. శివరాత్రి రోజున 11 లీటర్ల ఆవుపాలు, ఆవునెయ్యిలతో మహాన్యాసాన్ని జరిపితే అఖండమైన తేజంతో పాటు దీర్ఘావు కలుగుతుంది.  సంపద కలిగినవారు మహాశివరాత్రి రోజున శక్తానుసారం బంగారం లేదా వెండి కుందులతో ఆవునేతి దీపం వెలిగించి పండితుడికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది. శక్తిలేని వారు కనీసం తోటకూర కట్ట సమర్పించిన వారికి అఖండ సిరిసంపదలు కలుగుతాయి. 

Products related to this article

Pala Gavvalu (9 Pieces)

Pala Gavvalu (9 Pieces)

Pala Gavvalu ..

₹225.00

Navaratna set

Navaratna set

Navaratna setNavaratna refers to the nine gemstones related to the nine planets used in Vedic astrology. Importance is given to the combination of nine gems and are recognized as sacred. Navaratnas ar..

₹1,200.00

0 Comments To "Mahashivaratri "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!